హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం


అనంతపురం, 04 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్ గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులు హుటాహుటిన బస్సు నుంచి బయటకు దిగారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.

మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో NH-44పై కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్సు దగ్ధం కావడానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande