
ఢిల్లీ , 06 సెప్టెంబర్ (హి.స.) మహారాష్ట్రలోని పాల్గఢ్లో శివసేన నేతలు రెచ్చిపోయారు. ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు.
జన్మాష్టమి సందర్భంగా ‘దహి హండి’లో పాల్గొన్న కృష్ణ భక్త బృందానికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కు అతడ్ని తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో రూ.19,866 బిల్లు ఇవ్వడంతో ఆ వ్యక్తికి చెందిన బృంద సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన జిల్లా అధ్యక్షుడు కుందన్ సంఖే, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరత్, ఆ పార్టీ కార్యకర్తలు ఐసీయూలోకి ప్రవేశించారు. అక్కడున్న వైద్యులు, నర్సులతో వాగ్వాదానికి దిగారు. వారిని బెదిరించారు.
అయితే ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించిన ఒక రిసెప్షనిస్ట్ చెంపపై శివసేన నేత కొట్టారు. ఒక మహిళా ఉద్యోగిని ఆయన బెదిరించారు. గాయపడిన వ్యక్తికి అమర్చిన ఐవీ డ్రిప్ను తొలగించారు. అతడిని ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లినట్లు సిబ్బంది ఆరోపించారు.
మరోవైపు శివసేన జిల్లా అధ్యక్షుడు కుందన్, నగర అధ్యక్షుడు రాహుల్, స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర గావిత్ కుమారుడు రోహిత్ గావిత్తో సహా 17 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్