కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల అధ్వాన స్థితికి చేరుకున్నాం : కోరుట్ల ఎమ్మెల్యే
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అధ్వాన స్థితికి చేరుకున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు.
Mla


కోరుట్ల, 06 సెప్టెంబర్ (హి.స.)

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అధ్వాన స్థితికి చేరుకున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు.

మండలంలోని అయిలాపూర్ గ్రామంలో పల్లెల్లో విద్యాభివృద్ధి, పారిశుధ్య పరిస్థితులపై నిరసనగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నేడు క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, పల్లెల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు.

దేశంలో దాదాపు 6.5 లక్షల గ్రామాలు ఉండగా, ఉత్తమ గ్రామాల విభాగంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 40 అవార్డుల్లో 13 అవార్డులు (33 శాతం) సాధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.

నాడు కేసీఆర్ నాయకత్వంలో 'పల్లె ప్రగతి' కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు ఏర్పాటు చేసి పారిశుధ్యానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వాటా నిధులు రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయి, పారిశుధ్య పరిస్థితులు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నాటిన 250 కోట్ల మొక్కలను సంరక్షించాల్సింది పోయి, అభివృద్ధి పనుల పేరిట చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి పల్లెల అభివృద్ధిని కాపాడాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande