
ఢిల్లీ , 06 సెప్టెంబర్ (హి.స.)స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఎదురుగా నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన ఈస్ట్ ఢిల్లీ, మయూర్ విహార్ ప్రాంతం, అశోక్ నగర్ పరిధిలో ఆదివారం వేకువఝామున ఉదయం 4.00 గంటల సమయంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఏళ్ల ఒక వ్యక్తిపై కొందరు దుండగులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది. అయితే, పక్కనే ఉన్న నంద్లాల్ అనే గార్డు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ దుండగులు గార్డును కూడా బెదిరించారు. తమకు అడ్డొస్తే అతడిని కూడా చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అతడు దూరంగా ఉండిపోయాడు. ఇక, ఆ వ్యక్తిని కొట్టి చంపిన అనంతరం వారు అక్కడినుంచి పరారయ్యారు.
మృతుడి వయసు దాదాపు 40 సంవత్సరాలుగా ఉండగా, అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్