
మదనపల్లె, 06 సెప్టెంబర్ (హి.స.) మదనపల్లెకు చెందిన ‘లేడీ డాన్’ కోనేటి సులోచన ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వయించారు. కోర్టు సెర్చ్ వారెంట్తో మూడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేశారు.
సాధారణ వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించి.. ఏకంగా వందల కోట్ల సామ్రాజ్యానికి మహారాణిగా ఎదిగిన మదనపల్లె ‘లేడీ డాన్’ కోనేటి సులోచన అక్రమాల కోట బీటలు వారుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఒక మాజీ మంత్రి ముఖ్య అనుచరుడి అండదండలతో చెలరేగిపోయిన ఈమె నివాసంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. కోట్లాది రూపాయల విలువైన భూములను అక్రమంగా కాజేసిన వ్యవహారంలో న్యాయస్థానం జారీ చేసిన సెర్చ్ వారెంట్ ఆధారంగా ఈ దాడులు జరిగాయి. అమాయకుల ఆస్తులను కబళించిన ఈ లేడీ డాన్ పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ మదనపల్లె వాసులను విస్మయానికి గురిచేస్తున్నాయి.మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో పోలీసు శాఖ పకడ్బందీగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. సీఐలు మోహన్ కుమార్, రాజారెడ్డి, మహమ్మద్ రఫీలతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. సులోచన నివాసంతో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇంటి అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు లభ్యమయ్యాయి. బాధితుడు మార్పు వెంకటేష్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కదిలిన పోలీసు యంత్రాంగం పక్కా ప్రణాళికతో అక్రమాలను వెలికితీసే పనిలో పడింది.
50 రకాల ఆస్తి పత్రాలు, 15 ఫోర్జరీ సంతకాలతో ఉన్న ఖాళీ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో కలిసి కోట్ల విలువైన భూముల వ్యవహారంలో సులోచనపై ఆరోపణలు ఉన్నాయి. బండకమ్మమీదపల్లెలో రూ.60 కోట్ల విలువైన స్థలం, భవనం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిన వివరాలు. ఫోర్జరీ పవర్ ఆఫ్ అటార్నీతో 47 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు ఫిర్యాదు. స్వాధీనం చేసుకున్న పత్రాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV