
నారాయణపేట, 06 సెప్టెంబర్ (హి.స.)
నిరంతర విద్యుత్ కోతలతో పొలాలకు
నీళ్లు పెట్టుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు.
ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో మక్తల్ ట్యాంక్బండ్ వద్ద హైదరాబాద్-గద్వాల్ సర్కిల్ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
రైతుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ మార్గం జాతీయ రహదారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో సంగంబండ కెనాల్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారని రైతులు తెలిపారు.
ప్రస్తుతం వరి పంట గింజ గట్టిపడే దశలో ఉందని, ఈ సమయంలో పంటలకు నీరు అత్యవసరమని రైతులు పేర్కొన్నారు. విద్యుత్ కోతల కారణంగా చేతికొచ్చిన పంటలు కళ్లముందే నేలకొరిగే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే రోడ్డుపైకి వచ్చామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..