
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే తీవ్ర రసాభాసగా, వాడివేడిగా సాగుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారం సభను కుదిపేస్తుండగా, మరోవైపు '22-ఏ' భూముల అంశంపై బీజేపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది.
22-ఏ అంశంపై సభలో తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో కమలం పార్టీ శాసనసభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. స్పీకర్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
అంతకు ముందు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. '22-ఏ' భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గతంలో '22-ఏ' భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని ప్రభుత్వం చెప్పిన మాట ఏమైందని, ఆ ఆడిట్ నివేదిక ఎక్కడివరకు వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..