
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యతిరేకులను గుర్తించేందుకు బీజేపీ ప్రత్యేకంగా ఏజెన్సీలను పెట్టుకుందని, 2009 నుంచి ఓటింగ్ సరళని పరిశీలించి బీజేపీ వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.
నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవస్థ అంతా సిద్ధమవుతోందని గ్రహించి ఎస్ఐఆర్ రూపంలో కొత్త కుట్రలు తెరలేపారని ఆరోపించారు. తెలంగాణలో కోటి ఓట్లు తొలగిస్తున్నా బీఆర్ఎస్ నోరెత్తడం లేదని మండిపడ్డారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రముఖ రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో మాట్లాడిన సీఎం.. జాతీయ స్థాయిలో సెక్యూలర్ శక్తులు సమిష్టిగా మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న నా నియోజకవర్గం కొడంగల్ నుంచి వలస వెళ్లిన వేల మంది పేదల ఓట్లను ఈసీ తొలగిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో 81 వేల ఓట్లు అనామలీస్ జాబితాలో చేర్చారని ధ్వజమెత్తారు.
ఇవాళి ఓట్లతోనే 2029లో మోడీ ఓటమికి పునాది పడుతుందని ఓట్ల తొలగింపుపై అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎర్రజెండాను చూస్తే పేదోడికి ఒక నమ్మకం అని దేశానికి మోడీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి.. ఆయన ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అన్నారు.
కమ్యూనిస్టులు గత ప్రభుత్వంలో కార్మికులు, పేదల సమస్యలపై నిలదీస్తూ చేసిన పోరాటాలు మాకు ఉపయోగపడ్డాయన్నారు. ఆ పోరాటాలతోనే 2023 డిసెంబర్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఎన్నికల్ల కలిసి పోటీ చేసినా చేయకపోయినా కమ్యూనిస్టుల పోరాటం ప్రత్యక్షంగా పరోక్షంగా మా ప్రభుత్వం ఏర్పడటానికి దోహదపడిదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు