
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(సోమవారం) గన్పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. సబండ వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని 420 హామీలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అందుకే ఈరోజు శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ను ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా సభలో అవమానించిన ప్రజల కోసం హామీల అమలును ప్రశ్నించాలని అధినేత సూచించినట్లు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రలు కొత్త కాదని, గతంలో ఎన్నో చూశామన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి తరఫున కాంగ్రెస్ను ఈ సమావేశాల్లో పలు ప్రశ్నలు అడుగుతామని చెప్పారు. రియల్ ఎస్టేట్ కోసమే జీవో నం 97ను తీసుకువచ్చిందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. రూ.18 వేల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయని ప్రశ్నిస్తామన్నారు.
ఎన్నికల ముందు అభయహస్తం.. ఎన్నికల తర్వాత భస్మాసుర హస్తం అయిందని మాజీ మంత్రి విమర్శించారు. రాష్ట్రంలోని రైతన్నల తరఫున రైతాంగ సమస్యలపైన ప్రశిస్తామన్నారు. సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని డిమాండ్ చేస్తామన్నారు. కేసీఆర్ను ఎన్ని అవమానాలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి అని తమ అధినేత పిలుపునిచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా.. గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్