
ఆదిలాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.)
అసెంబ్లీ ఎదుట నల్ల దుస్తులతో నిరసనకు వెళ్లిన బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టారు.
దస్నాపూర్ బ్రిడ్జి వద్ద మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆందోళనను విరమించాలని పోలీసులు సూచించడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జోగు రామన్నను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు కార్యకర్తలు పోలీసు కాన్వాయ్కు అడ్డంగా పడుకుని రామన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో దస్నాపూర్ బ్రిడ్జి పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు