
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ వేదికగా తీవ్ర
దుమారం రేపుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై వ్యాఖ్యల వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఎట్టకేలకు స్పందించారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిని కప్పిపుచ్చుకునేందుకే తనపై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
తాను ఎప్పుడూ స్పీకర్ను కించపరిచేలా మాట్లాడలేదని, అలాంటి కుసంస్కారం తనకు ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు మండలి చైర్మన్ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. ఉదయం అసెంబ్లీ గేటు వద్ద తనపై హత్యాప్రయత్నం చేసిన కొందరిని, తమ పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులను ఉద్దేశించి మాత్రమే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
ప్రజాప్రతినిధులమని కూడా చూడకుండా తమ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కావాలనే స్పీకర్కు ఆపాదిస్తున్నారని తాతా మధు ఆరోపించారు. ప్రాణాపాయం నుంచి తనను తాను రక్షించుకోవడం కోసమే ఆ సమయంలో గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..