
కర్ణాటక, 07 సెప్టెంబర్ (హి.స.)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి పయనమైన ఒకే కుటుంబానికి చెందిన భక్తుల ప్రయాణం విషాదాంతమైంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకా పరిధిలోని చెన్నై బెంగళూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన నలుగురు అక్కడి కక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఎనిమిది మంది భక్తులు కారులో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుపతి నుంచి బెంగళూరుకు తిరిగి వస్తుండగా.. బేతమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డకరి వద్ద వీరి కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద ధాటికి కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన దేవేంద్ర కుమార్ (40), జిష్ణు (15), దీక్షిత (20), శారదాబాయి (70) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 ఏళ్ల బాలుడు, 70 ఏళ్ల వృద్ధురాలు ఉన్నారు.
కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో, స్థానికుల సాయంతో పోలీసు బలగాలు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బేతమంగళ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..