
హైదరాబాద్, 07 సెప్టెంబర్ (హి.స.) బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలతో తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈరోజు(సోమవారం) ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
అయితే 22 ఏ నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. శాసనసభలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యేలు.. సభకు సహకరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
బీఏసీలో నిర్ణయం తీసుకొని 22 ఏపై చర్చిద్దామని స్పీకర్ తెలియజేశారు. అయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు తమ నిరసనకు కొనసాగించారు.
వెంటనే నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీజేపీ సభ్యులు సభకు సహకరించాలని కోరారు. 22 ఏ అంశంపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారని.. ప్రొసీజర్ ఎలా ఉంటే అలా సభ నడవాలని సూచించారు. బీఏసీలో నిర్ణయించి 22 ఏ పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మొదట లఘు చర్చ 22 ఏ పైనే చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రశ్నోత్తరాలను నడవనివ్వాలని కోరారు. అయితే భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఏది అడిగినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బీజేపీకి అన్నింటిలో రాజకీయమే కావాలని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. విచారణ జరిపించాలని ఏడాది క్రితం లేఖ రాశామని తెలిపారు. బీఆర్ఎస్తో కుమ్మక్కై విచారణ జరపకుండా ఆపుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై విచారణ జరపకుండా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఆపుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్