
తిరుపతి, 07 సెప్టెంబర్ (హి.స.)
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు యత్నాలపై ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శులు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు అందరికీ ఉందని, అయితే దశాబ్దాల పాటు ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకున్న వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పార్టీ పెడుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తిరుపతి పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ-2గా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ నేరాలు చేయడంలో పార్టనర్స్ అని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో విచ్చలవిడిగా సాగిన నాసిరకం, అక్రమ మద్యం సరఫరా వల్ల రాష్ట్రంలో ఏకంగా 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది తీవ్ర అనారోగ్య పాలయ్యారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడంతో పాటు వేలాది కుటుంబాల నాశనానికి కారణమైన జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ ప్రజల కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV