
అమరావతి, 08 సెప్టెంబర్ (హి.స.)
అభివృద్ధిపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా వారి వద్దకు తీసుకెళ్లాలని తెలుగు దేశం పార్టీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు. అభివృద్ధితో ఓటు బ్యాంక్ పెంచుకుందామని పేర్కొన్నారు. ఏపీకి గూగుల్ వస్తే భారత్లోని ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయన్నారు. రాష్ట్రంలో కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తూ దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. డేటా సెంటర్లకు కావాల్సిన 5 టీఎంసీల నీరు అసలు సమస్యే కాదన్నారు.
టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్లో సుస్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లే అవకాశం ఉంది. డేటా సెంటర్ల ద్వారా అధిక మొత్తంలో ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉంది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి ఈ ఏడాది 1,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. ఆ నీటిలో కనీసం 300 టీఎంసీలు వాడుకున్నా పరిస్థితులను మార్చేయవచ్చు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం’ అని అన్నారు.
దేశంలో నంబర్ 1 డెవలపర్ అవ్వడమే నాకు కావాల్సింది. సాస్కి, ప్రభుత్వ నిధులు, నాబార్డ్ వంటి వాటి నుంచి వచ్చే నిధుల వినియోగానికి రూపకల్పన సిద్ధం చేసుకున్నాను. రాష్ట్రవ్యాప్తంగా సక్సెస్ స్టోరీలు క్రియేట్ చేసుకోవాలి. ఆలోచన మారితే ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. కుప్పం సమీపం నుంచి వెళ్తున్న ఓ జాతీయ రహదారికి దగ్గరిలో ఓ పారిశ్రామిక ప్రాంతాన్ని సృష్టించాం. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాం. ప్రజలకు ఇబ్బందిగా ఉన్న అంశాలను గుర్తించి వాటికి తగిన పరిష్కారాలను సూచించండి’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ