అసెంబ్లీ వ్యహహరం.. హైకోర్టులో వాడీవేడి వాదనలు.. తీర్పు వాయిదా
అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. నిన్నటి ఉత్తర్వులను సవరించాలంటూ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.
High court


హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.). అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. నిన్నటి ఉత్తర్వులను సవరించాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది ఎవరని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను అడ్డుకొని అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట బైఠాయించారని ఏజీ సుదర్శన్ రెడ్డి న్యాయస్థానానికి తెలిపారు.

ఫ్లకార్డులు, వ్యతిరేక రాతలతో ఉన్న టీషర్టులు ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారని ఏజీ చెప్పుకొచ్చారు. శాసనసభ్యుల నియమాళిని ఉల్లంఘించినందుకే పోలీసులు అడ్డుకున్నారని ఏజీ చెప్పారు. నిషేధాజ్ఞలను సైతం ఉల్లంఘించారని అన్నారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను సైతం దూషించారన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను కొంతమంది ఎమ్మెల్యేలు నెట్టివేసి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారం అసెంబ్లీ స్పీకర్పై ఉంటుందని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. సభ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుందని ఏజీ తెలిపారు. స్పీకర్ ఆదేశాల మేరకు చీఫ్ మార్షల్స్, పోలీసులు శాసనసభ్యులను అడ్డుకున్నారని ఏజీ వెల్లడించారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు నల్ల టీషర్టులు ధరించి ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించేలా వ్యవహరించారని ఏజీ అన్నారు.

పోలీసులపైన చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఆదేశాలు సవరించాలని ఏజీ హైకోర్టును కోరారు. పోలీసులైన దురుసుగా ప్రవర్తించిన వాళ్లపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల ఎందుకు అనుచితంగా ప్రవర్తించారని హైకోర్టు ప్రశ్నించింది. ఓ సీనియర్ మహిళా ఎమ్మెల్యే మెడపై చేయి వేసి ఎందుకు నెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరితోనూ అలా ప్రవర్తించలేదని కోర్టుకు ఏజీ తెలిపారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కౌంటర్ దాఖలు చేశాక పరిశీలిద్దామని ఏజీ న్యాయస్థానానికి చెప్పారు. నియమావళిలోని విషయాలను శాసనసభ్యులకు ఘటన కంటే ముందే తెలియజేశారా.? అని హైకోర్టు ప్రశ్నించింది.

అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది తెలిపారు. చీఫ్ మార్షల్స్కు స్పీకర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎలాంటి ఉత్తర్వులు లేవని బీఆర్ఎస్ న్యాయవాది చెప్పారు. ఎమ్మెల్యేలు ఏదైనా నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్ చర్యలు తీసుకుంటారని.. కానీ పోలీసులు కాదని బీఆర్ఎస్ న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. నిన్న పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలనే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్గా దాఖలు చేసిందని బీఆర్ఎస్ న్యాయవాది తెలిపారు.

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారనుకుంటే సదరు ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాల్సి ఉండేదని బీఆర్ఎస్ న్యాయవాది చెప్పారు. అలా కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు ఎందుకు తీసుకెళ్లారని బీఆర్ఎస్ న్యాయవాది ప్రశ్నించారు. నిన్నటి కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ న్యాయవాది చెప్పారు. ఇరువైపులా ముగిసిన వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande