
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సహా మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభలో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ‘స్పీకర్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. స్పీకర్ చైర్ను గౌరవిస్తామని.. అలాగే వ్యక్తిగతంగా కూడా స్పీకర్ అంటే మాకు చాలా ఇష్టం. చాలా సంవత్సరాలుగా సభలో కలిసి పనిచేశాం. స్పీకర్ను ఉద్దేశించి అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెప్పారు. స్పీకర్ను అన్నట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని మీడియా సమక్షంలో మా సభ్యుడు చెప్పారు. అయినా దీనిపై రాద్ధాంతం అవసరం లేదు. సభ్యుడు క్షమాపణ చెప్పారు. అరెస్ట్ కూడా చేశారు. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారు’ అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: మంత్రి అడ్లూరి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. స్పీకర్గా దళితుడు కూర్చోవడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని విమర్శించారు. కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి.. మాట తప్పారని, ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ఏనాడైనా కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతికి వచ్చారా అని ప్రశ్నించారు. ఆనాడు సంపత్ కుమార్ ఏం తప్పు చేశారని ఎక్స్పెల్ చేశారని నిలదీశారు. మహిళలను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. యావత్ తెలంగాణ జాతి స్పీకర్ పక్షాన నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.22ఏపై చర్చ జరగాలి: మహేశ్వరెడ్డి
వెంటనే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు చర్చ జరుపుతారో చెప్పాలని అన్నారు. ఈ సబ్జెక్ట్పై చర్చను క్లోజ్ చేయాలని ఏలేటి కోరారు. అనంతరం శాసనసభ కాసేపు వాయిదా పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్