
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) ప్రజా ప్రదేశాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళ కానిస్టేబుల్ ముందు బీఆర్ఎస్ నేతలు షర్ట్స్ తీయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇతర సంఘాల ప్రతినిధులతో కలిసి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశామని అన్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై మహిళా కమిషన్కు అర్జీ ఇచ్చామని పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ.. మహిళా పోలీసుల ఎదుట ఎమ్మెల్యేలు షర్టులు విప్పడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. అన్ని ఆధారాలతో మహిళా కమిషన్కు వివరాలు సమర్పించామని చెప్పారు. ఎమ్మెల్యేల చర్య మహిళా గౌరవానికి భంగం కలిగించేలా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బాధ్యులైన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే పద్మావతి విజ్ఞప్తి చేశారు.
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ప్రవర్తనకు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. మహిళా నేతలను రక్షించేందుకే పోలీసులు ప్రయత్నించారని గుర్తు చేశారు. మహిళల గౌరవం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా కమిషన్కు విజ్ఞప్తి చేశామని అన్నారు. తల దించుకుని మహిళ కానిస్టేబుల్ ఉన్నారు.. ఎంత దారుణమని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్