దళితుల ఆత్మగౌరవంతో చెలగాటం.. ఎమ్మెల్యేల వార్నింగ్
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఎదురిస్తామని, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎంత దూరమైనా పోరాడతామని ప్రభుత్వ విప్లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
Warning


యాదాద్రి భువనగిరి, 08 సెప్టెంబర్ (హి.స.) దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఎదురిస్తామని, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎంత దూరమైనా పోరాడతామని ప్రభుత్వ విప్లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.

అసెంబ్లీ స్పీకర్పై బీఆర్ఎస్ పార్టీ వైఖరిని, మాజీ సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకులు తుర్కపల్లి మండల కేంద్రంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వస్తోందన్నారు. అయితే కేసీఆర్ పాలనలో, బీఆర్ఎస్ నేతల వైఖరిలో దళితులను అణగదొక్కే ధోరణి కనిపించిందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర సాధనలో దళితుల పాత్ర ఎంతో కీలకమని గుర్తుచేశారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ఆచరణలో మాత్రం దళితులను 125 అడుగుల లోతుకు తొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు యావత్ దళిత జాతి మనోభావాలను గాయపరిచాయని అన్నారు. ఫామ్ హౌస్కే పరిమితమైనా కేసీఆర్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగడాలు తగ్గలేదని విమర్శించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా దళితులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్కు డప్పు కొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande