
ఢిల్లీ , 08 సెప్టెంబర్ (హి.స.)పంజాబ్-హరియాణా హైకోర్టు ఆపరేషన్ బ్లూస్టార్ బాధిత కుటుంబాలకు భారీ ఊరటనిచ్చింది. ఆపరేషన్ సమయంలో దుకాణాలు, వ్యాపారాలు దెబ్బతిన్న 133 కుటుంబాలకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
1984లో జరిగిన పరిణామాల సమయంలో ఈ 133 మంది దుకాణాలు, వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించిన వివాదం 2017లో సుప్రీంకోర్టుకు చేరింది. బాధితులు చదరపు గజానికి రూ.10,000 చొప్పున డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి నిర్ణయం కోసం కేసును హైకోర్టుకు పంపింది. ఆ తర్వాత 2020 జనవరిలో చదరపు గజానికి రూ.14,450 చొప్పున ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని నిర్ణయించారు. అయితే 2022 జులైలో పంజాబ్ ప్రభుత్వం మరోసారి ధరను పెంచి రూ.38,400గా నిర్ణయించింది. 2022లో భూమి ధర పెంపును బాధితుల తరఫు న్యాయవాదులు హైకోర్టులో సవాలు చేశారు. ఇన్నేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులపై భారీగా పెరిగిన భూమి ధరను మోపడం సముచితం కాదని వాదించారు. ఇన్నేళ్లుగా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులపై ఆర్థిక భారం పెరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పంజాబ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు భూమి ధరలను పెంచడాన్ని వారు సవాలు చేశారు. దాదాపు 42 ఏళ్లుగా తమ హక్కుల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. కేసులోని పరిస్థితులు, బాధితుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, 1988లో నిర్ణయించిన చదరపు గజానికి రూ.1,000 రేటును ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్