
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు తీరుపై మండిపడ్డారు. ‘నా తల్లిని అన్నారు.. నాకు ఆగ్రహం ఉంటుంది. నీ తల్లిని అనలేదు. నీకెందుకు ఆగ్రహం’ అంటూ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తన సోదరీమణులతో సమానమని తెలిపారు.
వారిపై దాడి జరిగిందని తెలియగానే నివేదిక కోరినట్లు స్పీకర్ చెప్పారు. నివేదిక వచ్చాక చర్యలు తప్పక తీసుకుంటామన్నారు. కానీ ముందు తన సంగతేంటో చెప్పాలని.. ‘నా తల్లిని అన్నారు.. హరీశ్ రావు ముందు దీనిపై మాట్లాడాలి’ అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీరియస్ అయ్యారు.
వారిపై జరిగిన ఘటన వివరాలు తెప్పించుకుంటున్నామని.. సీఎం ఈ ఘటనపై నివేదిక కోరారని మంత్రి వెల్లడించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇష్టానుసారం చేస్తామనడం సరికాదన్నారు. స్పీకర్ను సభ్యులు అగౌరవపరిస్తే కనీసం స్పందించరా అని ప్రశ్నిస్తూ.. సభాపతిని బెదిరించడం పద్ధతి కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
స్పీకర్కు క్షమాపణ చెప్పాలి: లక్ష్మణ్
ఒక దళిత స్పీకర్ను అవమానించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వారి తల్లిని అవమానించారని.. బీఆర్ఎస్కు మాట్లాడడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. కేటీఆర్ ఓ పోలీసు అధికారి గల్లా పట్టి కొట్టారని.. హరీశ్ రావు మహిళా అధికారుల ముందు షర్ట్ విప్పారని అన్నారు. ముందు స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్