
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) తాను ప్రజాస్వామిక పద్ధతిలో సభ నడుపుతున్నానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించారు. నిన్నటి సంఘటనతో తాను బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వనని తెలిపారు. ఈరోజు తనకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెబుతారని అనుకున్నానని అన్నారు. ఈరోజు (మంగళవారం) అసెంబ్లీలో స్పీకర్ మాట్లాడారు. తనకు క్షమాపణ చెప్పకపోగా బీఆర్ఎస్ సభ్యులు సభను డైవర్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను మొదటిసారి బీఆర్ఎస్ సభ్యులపై కోప్పడుతున్నానని తెలిపారు. తనను ఎవరూ ఎప్పుడూ ఏం అనలేదని అన్నారు. తానెప్పుడు మీడియా ముందుకు రాలేదని తెలిపారు.
కేసీఆర్ సభకు రావాలి..
ఇలాంటి సంఘటనలు తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘నేను చాలా భావోద్వేగంతో ఉన్నాను. ఈరోజు సభను నడిపించలేకపోతున్నా. ప్యానెల్ స్పీకర్ను పెట్టి సభ నడిపించాలని కోరాను. మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ సభకు రావాలి. ప్రతిసారి సభకు ముందు కేసీఆర్కి కాల్ చేస్తాను. నా ఆరోగ్యం సహకరిస్తే వస్తానని కేసీఆర్ చెప్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభలో సభ్యుడు కాకపోయినా చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ఆలోచ మాకు లేదు. జరిగిన పరిణామాల పట్ల చింతిస్తున్నాను. ఈ రోజు స్పీకర్ చైర్లో కూర్చొవాలని లేదు. ప్యానల్ స్పీకర్గా కడియం శ్రీహరిని కూర్చొబెడుతున్నాం. తాతా మధు వ్యాఖ్యలతో ఈ రోజు చైర్ లో కూర్చొవాలని లేదు’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్