
హైదరాబాద్, 08 సెప్టెంబర్ (హి.స.) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చావును కోరుకుంటున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్.. మీడియా ముఖంగా అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ఇంటిపైన దాడి చేయిస్తామన్నారని తెలిపారు. ఎందుకు ఇంత స్థాయికి దిగజారుతున్నారో? చెప్పాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీకి రాకుండా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మగోడువైతే కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోవాలని వేముల ప్రశాంత్ రెడ్డికి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వేముల వీరేశంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని అన్నారు. కేసీఆర్ చావు గురించి మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆకాంక్షించారు. అందుకు సహకరించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన స్పష్టం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతిని గత సమావేశాల్లో బయటపెట్టామని గుర్తు చేశారు. శిఖండిలా కడియం శ్రీహరిని ముందు పెట్టి రాజకీయాలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై నిప్పులుచెరిగారు. మమ్మల్ని సభ లోపలికి రానివ్వకుండా తమపైనే కేసులు పెట్టారని ఈ సందర్బంగా ఎమ్మెల్యే అవేదన వ్యక్తం చేశారు.
స్పీకర్ను తాతా మధు ఏమీ అనలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత్ర రాహుల్ గాంధీని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిడితే కేసీఆర్ బహిరంగంగా ఖండించారని ఈ సందర్భంగా వివేకానంద గుర్తు చేశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారికి క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించే విధంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారని వివేకానంద తెలిపారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
అసెంబ్లీ గేటు వద్ద ఏం జరిగిందో విచారణ చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలం మేము వెనుక ఉన్నామని తెలిపారు. పోలీసులు బారికేడ్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కింద పడ్డారని చెప్పారు. మహిళా పోలీసులను దగ్గర పెట్టి ఇబ్బందులు సృష్టించారని పేర్కొన్నారు. అసెంబ్లీకి వస్తే తమపై దాడులు చేస్తున్నారని అన్నారు.
మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు ఎందుకు లోపలికి పంపలేదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. సీఎం అసెంబ్లీకి వచ్చి కేసీఆర్పైన బూతు పురాణాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు సీఎంగా కేసీఆర్ ఉన్నారా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పాలన చేతగాక పోతే సీఎం పదవికి రాజీనామా చెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్