
ఖమ్మం, 08 సెప్టెంబర్ (హి.స.)
వినాయక నవరాత్రి ఉత్సవాలు
ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా కారేపల్లి పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
ఉత్సవాల నేపథ్యంలో వినాయక విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ క్రమంలో సోమవారం కారేపల్లి క్రాస్రోడ్లోని వినాయక విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాల నిర్వాహకులు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 24 గంటలూ పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్, అగ్నిప్రమాదాలకు ఏమాత్రం అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వినాయక ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు