
కర్నూలు, 08 సెప్టెంబర్ (హి.స.) కర్నూలు జిల్లా ప్రజలు మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.
ఈ రోజు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం కాలుష్య రహిత వినాయక చవితి అనే నినాదంతో కూడిన పోస్టర్ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పర్యావరణానికి హాని కలిగించకుండా జరుపుకోవాలని, రసాయనాలతో చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను పూజించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
POP విగ్రహాల తయారీలో ఉపయోగించే జిప్సం, సల్ఫర్, మెగ్నీషియం మరియు సీసం వంటి రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని, ఇవి సాధారణంగా నీటిలో త్వరగా కరగవని, వాటి ప్రభావం మానవులపైనే కాకుండా మొక్కలు మరియు జంతువులపై కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో పీఓపీతో చేసిన వినాయక విగ్రహాలకు బదులు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV