
అమరావతి, 09 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు, ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్వోపీ) అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కార్యాచరణ ప్రణాళికతో ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రానున్న కాలంలో రాష్ట్రంలో సీసీఐ గుర్తించిన, మార్కెటింగ్ శాఖ సిఫారసు చేసిన మార్కెట్ యార్డులు, జాయింట్ కలెక్టర్లు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తి కొనుగోలు చేస్తారు.
స్లాట్ బుకింగ్ కోసం, కొనుగోలు కేంద్రాలలో పత్తి అమ్మకానికి రైతులు ఆధార్, పట్టాదార్ పాసుపుస్తకం నకళ్లను రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వాలి. సాగు విస్తీర్ణం, మండలాల వారీగా హెక్టారు కు దిగుబడి, కోతల వారీ ఉత్పత్తిని గుర్తించి, పత్తి విక్రయాలకు సీసీఐ అనుమతి ఇస్తుంది. సీసీఐ ద్వారా రైతుకు ఆధార్ అనుసంధాన బ్యాం కు ఖాతాకే ఆన్లైన్ చెల్లింపులు జరుగుతాయి. జిన్నింగ్ మిల్లుల్లో సీసీటీవీల విశ్లేషణకు హైకోర్టు ఆదేశాల మేరకు సీసీఐ అవసరమైన చర్య లు తీసుకోవాలి. గతంలో పత్తి సేకరణలో స్లాట్ బుకింగ్, జిన్నింగ్ మిల్లులను ఎల్1,2,3 పద్ధతిలో తెరవడంలో తలెత్తిన ఇతర సమస్యలతోపాటు, గుంటూరు, కర్నూలులో మరిన్ని మిల్లులు ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సీసీఐ తగిన చర్యలు తీసుకోవాలి. కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోళ్ల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ