
హైదరాబాద్, 09 సెప్టెంబర్ (హి.స.)
తమ ప్రతిష్టను దిగజార్చేందుకు కృత్రిమ మేధస్సు ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐ-జనరేటెడ్ చిత్రాలను ఆయుధంగా మలుచుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణ అధికారులు ఇలాంటి తీవ్రమైన సైబర్ నేరాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాము ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వమే స్వయంగా తమ పరువు తీసేందుకు ఈ రకమైన ఏఐ నకిలీ చిత్రాలను వ్యాప్తి చేసి, దుష్ప్రచారానికి పాల్పడితే చట్టపరంగా పూర్తిస్థాయిలో న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఈ ఏఐ-జనరేటెడ్ చిత్రాలను ప్రసారం చేస్తూ తమ వ్యక్తిగత, రాజకీయ గౌరవానికి భంగం కలిగించే మీడియా సంస్థలను కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కల్పిత దృశ్యాలను సృష్టించి విడుదల చేసిన వ్యక్తులతో పాటు, వాటిని విస్తృతంగా ప్రచారం చేసి తమ పరువును బజారుకీడ్చేందుకు యత్నించిన మీడియా హౌస్లపై కూడా చట్ట ప్రకారం పరువు నష్టం మరియు క్రిమినల్ దావాలు దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు