బిజినెస్, 11 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కి భారీ ఊరట లభించింది. ఈ నెల 14 నుంచి ఏపీలో స్విగ్గీని బాయ్కాట్ చేయాలన్న నిర్ణయాన్ని ఏపీ హోటల్స్ అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యం నిన్నహోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో సుధీర్ఘ చర్చలు జరిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా 12 అంశాలపై చర్చించారు. ఈ చర్చల సందర్భంగా హోటల్స్ అసోసియేషన్ విధించిన షరతులకు స్విగ్గీ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని, దీంతో స్విగ్గీని బహిష్కరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు హోటల్స్ అసోయేషన్ అధ్యక్షుడు ఆర్.వి. స్వామి, కన్వీనర్ రమణరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ ఒకటి నుంచి స్విగ్గీతో చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. కాగా స్విగ్గీ తమకు గత కొన్ని నెలలుగా నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుంచి ఏపీలో స్విగ్గీ అమ్మకాలు నిలిపివేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..