విజయవాడ, 21 నవంబర్ (హి.స.)
నార్పల: అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం... కృష్ణ కిషోర్ (45), భార్య శిరీష (35) తమ ఐదు నెలల చిన్నారితో కలిసి పోలీస్స్టేషన్ సమీపంలోని సంతబజారులో నివాసం ఉంటుంన్నారు. ఐదు రోజుల నుంచి వారెవరూ బయటకు రాలేదు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన కొందరు పక్క ఇంటి మిద్దెపై నుంచి ఇంట్లోకి చూశారు. తీవ్రమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్సై సాగర్, ఆర్ఐ జ్యోతి, ఏఎస్సై నాగరాజు తదితరులు అక్కడికి చేరుకొని తలుపులు బద్దలుకొట్టి చూడగా.. భార్యాభర్తలిద్దరూ ఉరివేసుకొని ఉన్నారు. ఉయ్యాలలో చిన్నారి విగతజీవిగా పడి ఉన్నాడు. ఆర్థిక సమస్యల వల్లే ఉత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. కిషోర్ మెడికల్ స్టోర్ నిర్వహించేవాడని ఈ క్రమంలో అప్పులు ఎక్కువయ్యాని అంటున్నారు. ఆత్మహత్య చేసుకొని నాలుగైదు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాగర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల