హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
ఓ వృద్ధుడిపై గుర్తుతెలియని యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణం బాపూజీనగర్ లో జరిగింది. మంగళవారం రాత్రి బాపూజీ నగర్ లోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వెనుక అలువాల మాలకొండయ్య అనే వృద్ధుడు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఆయన దాదాపు 40 ఏళ్లుగా సిమెంట్ రింగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి లాగే దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి సంచిలో తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడిలో వృద్ధుడు మాల కొండయ్యకు తీవ్ర గాయాలపాలయ్యాడు. తండ్రి అరుపులకు ఇంటి నుంచి చిన్న కొడుకు రావడంతో రోడ్డుపై తండ్రి విలవిల లాడుతూ కనిపించాడు. తండ్రిపై దాడి చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు మాలకొండయ్య చిన్న కుమారుడు ప్రయత్నించడంతో ఆ యువకుడు వెంట తెచ్చుకున్న సంచుల నుంచి పెట్రోల్ ప్యాకెట్లను మీద చల్లుతూ పరుగులు తీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్