విశాఖపట్నం, 4 డిసెంబర్ (హి.స.)వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రస్తుతం చలి తక్కువగానే ఉంది. డిసెంబరు నెల ప్రవేశించినా అనేక ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఏమీ లేదు. నవంబరులో అనేక ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఉత్తర, వాయవ్య, తూర్పు భారతంలో చలిగాలులు వీచే వాతావరణం ఏర్పడలేదు. ఇంచుమించు అటువంటి వాతావరణమే డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకూ మూడు నెలల శీతాకాలంలో కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప దేశంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని తెలిపింది. అంటే గజగజ వణికించే వాతావరణం తక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వాతావరణంలో మార్పుల ప్రభావంతోనే చలిగాలుల తీవ్రత తగ్గిందన్నారు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న తటస్థ పరిస్థితులు ఈ నెలాఖరు లేదా జనవరిలో ‘లానినా’గా మారే అవకాశం ఉందన్న అంచనా నేపథ్యంలో జనవరిలో చలి స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల