నిప్పుల కుంపటిగా రాష్ట్రం.. సాధారణం కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు
హైదరాబాద్: ఏప్రిల్ 19 (హిం.స) రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే మంట పుట్ట
నిప్పుల కుంపటిగా రాష్ట్రం.. సాధారణం కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు


హైదరాబాద్: ఏప్రిల్ 19 (హిం.స)

రాష్ట్రంలో భానుడి ప్రతాపం

రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చండ ప్రచండ వేడితో

ప్రజలు తల్లడిల్లుతున్నారు.

మంచిర్యాల జిల్లా హాజిపూర్లో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. అదే విధంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీ ల సెల్సియస్,ములుగు జిల్లా మేడారంలో 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని

వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని సూచించింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వచ్చే నెల మేలో పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 43.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్లో 24.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు అయింది..భద్రాచలం, నల్లగొండలో 4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, నిజామాబాద్, రామగుండంలో 3 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ మేర సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande