2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్ పునరుద్ధరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్
కాచిగూడ, 19 ఏప్రిల్ (హిం.స)దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్వర్క్లో ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించి
2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్ పునరుద్ధరణలో  దక్షిణ మధ్య రైల్వే రికార్డ్


కాచిగూడ, 19 ఏప్రిల్ (హిం.స)దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్వర్క్లో ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించి మునుపెన్నడూలేనివిధంగా 649 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణను పూర్తి చేయడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పనితీరును సాధించింది. ఇది జోన్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా సాధించని అత్యుత్తమ రికార్డు. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 448 కిలోమీటర్ల పునరుద్ధరణ పనులతో పోలిస్తే 45శాతం ఎక్కువ. ముఖ్యంగా ఈ పని మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా యాంత్రీకరణ పద్దతి ద్వారా చేపట్టడం ద్వారా ఈ రికార్డు స్థాయి విజయం చేకూరింది.

రైల్వే ట్రాక్లు ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైళ్ల కదలికను అవాంతరం లేకుండా నిరంతరం సులభతరం చేస్తూ రైల్వే వ్యవస్థలో వెన్నెముకగానిలుస్తుంది. సామర్ధ్యవంతమైన రైలు కార్యకలాపాల నిర్వహణ మరియు భద్రతను పెంచే చర్యలలో ట్రాక్ల పునరుద్ధరణ పనులు అనేవి కీలకమైన అంశాలలో ఒకటి. పూర్తి ట్రాక్ పునరుద్ధరణ పనిలో సాధారణంగా స్లీపర్ల పునరుద్ధరణలో మోడిఫైడ్ వైడర్ బేస్ కాంక్రీట్ స్లీపర్లతో పాత స్లీపర్లను మార్చడం; పాత పట్టాలను క్లాస్-1 పట్టాలతో మార్చడం, ప్లెయిన్ ట్రాక్ వేయడం మరియు పాయింట్లు & క్రాసింగ్లను మార్చడం వంటి అనేక పనులు ఉంటాయి. స్లీపర్లు మరియు పట్టాల పునరుద్ధరణ పనులు ప్లాసర్ క్విక్ రిలేయింగ్ సిస్టమ్ (పి.క్యూ.ఆర్.ఎస్.) మెషీన్ల ద్వారా నిర్వహించబడుతుంది, ట్రాక్ రిలేయింగ్ రైలు (టి. ఆర్. టి.) మెషీన్ల ద్వారా సాధారణ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు మరియు పాయింట్లు & క్రాసింగ్ల కోసం టి-28 యంత్రాలు ద్వారా చేయబడుతాయి .

దక్షిణ మధ్య రైల్వేలో పూర్తి ట్రాక్ పునరుద్ధరణ (సి.టి.ఆర్.) పనులు పూర్తిగా యంత్రాల ద్వారా చేపట్టబడ్డాయి. ట్రాక్ పునరుద్ధరణ పనులు మాన్యువల్ పద్ధతిలో చేయడం కంటే యాంత్రిక సాధనాలను ఉపయోగించి చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ట్రాక్ పునరుద్ధరణలో కాంక్రీట్ స్లీపర్లను మాన్యువల్గా వేయడం కష్టమేకాకుండా స్లీపర్లకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఇంతేకాకుండా అదనంగా, ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టిన తర్వాత రైలు ప్రారంభ వేగ పరిమితిలో వ్యత్యాసం ఉంటుంది. మాన్యువల్గా చేపట్టే ట్రాక్ పునరుద్ధరణ మార్గాలతో పోలిస్తే మెకానికల్ పద్దతి ద్వారా ట్రాక్ పునరుద్ధరణ చేసినప్పుడు రైలు వేగపరిమితి గంటకు 20 కిలోమీటర్లకు బదులుగా గంటకు 30 కిలోమీటర్ల వేగపరిమితి ఉంటుంది . తత్ఫలితంగా రైళ్ల సాధారణ వేగం సమయం తగ్గడంతో పాటు రైళ్ల సగటు వేగం పెరుగుతోంది. దీనికి అదనంగా ట్రాక్ నిర్వహణ పనుల కోసం పట్టే సమయం కూడా ఆదా అవుతుంది అంతేకాకుండా ట్రాక్ వెంట నిరూపయోగంగా పోగయ్యే సామగ్రిని కూడా నివారించవచ్చు.

జోన్ అంతటా ట్రాక్ పునరుద్ధరణ పనులు అన్ని సంబంధిత శాఖలచే ఖచ్చితమైన ప్రణాళిక మరియు సమర్థవంతమైన సమన్వయంతో జరిగాయి. ట్రాక్ పునరుద్ధరణకు అవసరమయ్యే విభాగాలు ముందుగానే గుర్తించబడ్డాయి మరియు తక్కువ వ్యవధిలో గరిష్ట ఉత్పత్తిని పొందడానికి సరి అయిన రీతిలో యాంత్రిక మరియు మానవశక్తి వినియోగం జరిగింది. జనరల్ మేనేజర్ ఈ మైలురాయిని సాధించడంలో ఇంజినీరింగ్ బృందం చేసిన కృషిని అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే స్పూర్తితో పనులు జరిగేలా ప్రణాళికలు రచించుకోవాలని అధికారులకు సూచించారు

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande