హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి గారు,
మీరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారని మీడియా మిత్రుల ద్వారా తెలిసింది. కొందరు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు మా దృష్టికి కొన్ని విషయాలను తీసుకుని వచ్చారు. ఒక జర్నలిస్టుగా, జర్నలిస్టు నాయకునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, రాజకీయ పార్టీ అధ్యక్షునిగా కొన్ని విషయాలను మీ దృష్టిలో ఉంచాల్సిన బాధ్యత మాపై ఉన్నది.
అర్హులైన జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మీతో పాటు జై స్వరాజ్ పార్టీ కూడా కోరుకుంటున్నది. ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది జై స్వరాజ్ పార్టీ.
కానీ సుమారు 20 ఏళ్లుగా నానుతున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు వివాదం మీ దాకా ఎందుకు వచ్చిందో ఒకసారి పూర్వాపరాలు తెసుకుని సరి కొత్త నిర్ణయం తీసుకోవాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజ శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయం మరోసారి చర్చకు వచ్చింది. రాజ శేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన మాట ప్రకారం అప్పటికే ఉన్న హౌసింగ్ సొసైటీ ద్వారా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఆలోచన చేస్తే సీఎం దగ్గర లాబీ చేసే జర్నలిస్టులు కొందరు దానిని అడ్డుకున్నారు. దీంతో సమాచార ప్రజా సంబంధాల శాఖ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని రాజ శేఖర్ రెడ్డి ఆదేశాలు ఇస్తే, ఆ శాఖ కమిషనర్ జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ విషయం కూడా నచ్చని ఆ కొందరు లాబీయిస్ట్ జర్నలిస్టులు తామే కొత్త జర్నలిస్టు హౌసింగ్ సొసైటీనీ ఏర్పాటు చేస్తామని దానికి భూమి కేటాయించాలని అనాటి సీఎం సలహాదారు కే.వీ.పీ రామచంద్రా రావు చేత రాజ శేఖర్ రెడ్డిని ఒప్పించి ఇప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు మ్యూచువల్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేశారు.
స్థానికంగా ఐదేళ్లు జర్నలిస్టు వృత్తిలో ఉన్న వారే దరఖాస్తు చేసుకోవాలని ఒక నిబంధన ఉంది.
సొసైటీ ఏర్పాటులోనే కనీస అర్హత లేని కొందరిని డైరెక్టర్లుగా చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి నుంచి ఈ సొసైటీలో అవినీతికి బీజాలు పడ్డాయి.
సభ్యత్వాల ఖరారులో అన్నీ అవకతవకలే. కే.వీ. చెప్పిండని కొందరి పేర్లు, మంత్రులు చెప్పారని ఇంకొందరి పేర్లు, అర్హత లేని మంత్రుల పీఏల పేర్లు, సొసైటీని రిమోట్ లా నడిపిస్తున్న కొందరు జర్నలిస్టు పెద్దలకు ఉన్న పత్రికల నుంచి సర్వీస్ సర్టిఫికెట్లను తయారు చేయించి అనేక మందికి సభ్యత్వం కల్పించారు. గతంలో అధికారికంగా ఇళ్ల స్థలాలు తీసుకున్న జర్నలిస్టు పెద్దలు బినామీ పేర్లతో సభ్యులుగా చేరారు. హైదరాబాద్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని తెలిసి నాన్ లోకల్ వారు అనేక మంది హెడ్ ఆఫీస్ లో మాట్లాడుకుని హైదరాబాద్ బదిలీ చేయించుకుని సభ్యులుగా చేరిన వారు ఉన్నారు. 2004 నుంచి 2008 వరకు ఈ ప్రక్రియ జరిగిన నేపథ్యంలో అలా వచ్చి చేరారు. 1100 పైగా సభ్యులుగా ఉన్న సొసైటీలో 25 శాతానికి పైగా అనర్హులేనని అప్పుడు మా దృష్టికి వచ్చింది. ఈ లోగా ప్రభుత్వం 70 ఎకరాల భూమిని సొసైటీకి కేటాయించనున్నదని వెంటనే ప్రతి సభ్యుడు సభ్యత్వ రుసుముతో పాటు రెండు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో అధిక వడ్డీతో అప్పులు చేసి, బంగారం కుదవ బెట్టి ఎలాగో చెల్లించారు బక్క జర్నలిస్టులు .కొందరు అదీ కూడా చెల్లించని జర్నలిస్టులు ఉన్నారు. ప్రభుత్వం 74 ఎకరాల భూమిని కేటాయించిన తరువాత ఇక కొద్ది రోజుల్లో జర్నలిస్టుకు 300 గజాల చొప్పున పంచుకునే సమయంలో ప్రభుత్వం భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 16 ఏళ్లుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ప్రక్రియ ఆగిపోయింది.
ముదిగొండ అమరుల నేపథ్యంలో..!
ఇళ్ళు లేని పేదలకు 60 గజాల ఇంటి స్థలం కోసం తీవ్రంగా కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమం చేస్తున్న రోజులవి. ఈ నేపధ్యంలోనే ఖమ్మం జిల్లా ముదిగొండలో ఇళ్ల స్థలాలు కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరులో కొందరు పేదలు పోలీసుల తుపాకీ గుళ్ళకు బలైనారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, జఢ్జిలకు 500 గజాలు, జర్నలిస్టులకు 300 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని వందల ఎకరాలు ఆయా సొసైటీలకు భూములు రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. పేదలు 60 గజాల ఇంటి స్థలం అడిగితే కాల్పులు జరిపిన ప్రభుత్వం ఈ ప్రముఖ వృత్తుల్లో ఉన్న వారికి ఏ ప్రాతిపదికన ఇన్ని వందల ఎకరాలు కేటాయించారని సవాలు చేస్తూ ఒక స్వచ్ఛంద సేవకుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ వాదనను విన్న హైకోర్టు ఆనాడు ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, జడ్జిలు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలను కేటాయించడాన్ని తప్పు పడుతూ ఆ జీవోను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది.
వన్ టైం బెనిఫిట్ కింద అంగీకారం తెలిపిన సుప్రీంకోర్టు
ఈ ఇళ్ల స్థలాల కేసు సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లింది. ఈ 16 ఏళ్లుగా సుప్రీంకోర్టులో వాయిదాలు, వాదనలు నడిచాయి. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజులు అవి. తెలంగాణ వస్తే తమకు ఇళ్ల స్థలాలు రావని కొందరు జర్నలిస్టులు సుప్రీంకోర్టులో ప్రభుత్వం విధానం చెప్పాలని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద లాబీ చేశారు. ఏ రోజైన తెలంగాణ ప్రకటన వస్తుందని తెలిసి ఒక రోజు రాత్రి 9 గంటలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కొందరు ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పిన విషయం ఈ జర్నలిస్టులకు నచ్చలేదు. గతంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందని వారు, తనకు గాని, తన భార్య పేరగాని వారసత్వంగా వచ్చిన లేదా కొనుకున్న ఇల్లు లేని వారికి వన్ టైం బెనిఫిట్ కింద ఇంటి స్థలం కేటాయిస్తామని ప్రభుత్వం తరఫున ఒక లేఖ ఇవ్వండి. అదే విధంగా తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. దానికి మీరు ఓకే అయితే చెప్పండి. వెంటనే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లేఖ పంపుతుంది' అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ షరతు వీరికి నచ్చలేదు. బాగానే ఉంది గదా అని అందులో ఉన్న నేను అనబోయే లోపు నా పక్కన ఉన్న ఒక సీనియర్ జర్నలిస్టు నా నోరు మూశారు. సుప్రీంకోర్టు తన తీర్పులో వన్ టైం బెనిఫిట్ విషయమే తెలిపింది
కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
నిజమైన జర్నలిస్టుల తరుఫున పోరాడిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్
నిజమైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు దక్కాలని, ఫేక్ జర్నలిస్టులు, రెండు మూడు సార్లు ఇంటి స్థలాలు తీసుకున్న వారిని, ఒక ఇంటిలోనే ఇద్దరు, నాన్ లోకల్ వారిని తొలగించాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ తీవ్రంగా పోరాడింది. ప్రతి జనరల్ బాడీ సమావేశంలో బహిరంగంగా డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో ట్రేడ్ యూనియన్ గా ఏర్పడి జర్నలిస్టుల కోసం, రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసిన ఏకైక సంఘం టీజేయూ.
అల్లాడిన... అప్పు తెచ్చిన జర్నలిస్టులు
ప్రభుత్వం సొసైటీకి భూమి కేటాయిస్తుందని, వారంలో రెండు లక్షల రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో సభ్యత్వం ఉండదని చెబితే ఆనాడు నానా ఇబ్బందులు పడి కొందరు జర్నలిస్టులు చెల్లించారు. 3000 నుంచి 10 వేల రూపాయల లోపు జీతం తీసుకునే జర్నలిస్టులే అధికం, పైగా చాలా సంస్థలు జీతాలు నెలలు నెలలు ఇవ్వని రోజులవి. వారంలో రెండు లక్షలు పుట్టడం బక్క జర్నలిస్టులకు కష్టమే. కొందరు నెలకు ఐదు నుంచి పది రూపాయల వడ్డీకి తెచ్చి కట్టారు. ఇంకొందరు భార్యల పుస్తెలతో సహా బంగారం కుదువబెట్టి తెచ్చి సొసైటీకి కట్టారు. కొద్ది రోజుల్లో ఇంటి స్థలం వస్తుంది కదా కష్టాలు తీరుతాయని వారు ఆనాడు ఆ సాహసం చేశారు. వీరు కట్టిన డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరింది హైకోర్టు తీర్పుతో ఇఃటి జాగా అటకెక్కింది. కోర్టు కేసు ఎప్పుడు తేలుతుందో తెలియదు, తెలంగాణ ఉద్యమం కారణం చూపి ఉద్యోగాలు పీకిన యాజమాన్యాలు, సకాలంలో జీతాలు రాక ఇల్లు గడవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రెండు లక్షల వడ్డీ పెనుభారంగా సాధారణ జర్నలిస్టులకు మారింది. ఈ నేపధ్యంలో సొసైటీ తన ఖాతాలో ఉన్న డబ్బును అవసరమైన వారికి లక్ష రూపాయల చొప్పున తిరిగి చెల్లించింది. ఎలాగూ సొసైటీ తిరిగి ఇస్తుండటంతో మరీ కష్టాల్లో ఉన్న వారు మిగతా లక్ష తీసుకుంటామని కోరితే సభ్యత్వాన్ని రద్దు చేసి వారికి మిగతా లక్ష ఇచ్చి అత్యంత దుర్మార్గమైన చర్యకు ఒడిగట్టారు సొసైటీలో కొందరు జర్నలిస్టులు నాయకులు . సుమారు 60 మంది జర్నలిస్టుల వ్యక్తిగత కష్టాలను ఆసరా చేసుకుని వారి సభ్యత్వం రద్దు చేశారు సొసైటీ నాయకులు.
సీఎం రేవంత్ గారు,
ఇప్పుడు వారు మానవతా దృక్పథంతో తమను పరిగణనలోకి తీసుకుని తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతుంటే మిగిలిన జాగాను మేమే పంచుకుంటాం. మీకు ఇచ్చేది లేదు అని మూర్ఖత్వంతో సమాధానం చెబుతున్నారు.
సీఎం రేవంత్ గారు, తోటి జర్నలిస్టులపై వారికి మానవత్వం లేనప్పుడు, మరి మీరెందుకు అన్ని ఎకరాల, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఈ సొసైటీకి ఇస్తున్నారు? ఆనాడు ప్రభుత్వానికి కట్టిన డిపాజిట్ లో వారి వాటా కూడా ఉన్నదనే విషయం సొసైటీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. వారిని కూడా ఈ సొసైటీలోకి తప్పని సరిగా తీసుకోవాలి.
సొసైటీ పేర అనర్హులకు ఇవ్వాల్సిన అవసరం లేదు
సీఎం రేవంత్ గారు, సొసైటీల పేర హైదరాబాద్లో ప్రభుత్వ భూములను, ప్రభుత్వ చెరువులను ఎలా కబ్జా చేసి దోచుకున్నారో మీకు బాగా తెలుసు. జర్నలిస్టు సొసైటీలో ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రభుత్వ భూములను తీసుకుని వచ్చి ఈ సొసైటీలో చేరిన వారు ఉన్నారు. ఈ సొసైటీలో ఎలాగూ వస్తుందని గతంలో తీసుకున్నవి అడ్డు రావద్దని అమ్ముకున్న వారు ఉన్నారు. గత ఇరవై ఏళ్లుగా ప్రభుత్వంలోని పెద్దలతో అంట కాగుతూ ఇళ్ళు నిర్మించుకున్న వారు ఉన్నారు. రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంలో నడిపించుకున్న వారు కొందరైతే, కేసీఆర్ ప్రభుత్వంలో ఇళ్ళు పొందిన వారు మరి కొందరు. వీళ్లందరూ ఈ సొసైటీలో ఉన్నారు. మరి కొందరు ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాలు పొందిన వారు ఉన్నారు. కొందరు చంద్రబాబు ప్రభుత్వంలో, మరి కొందరు జగన్ ప్రభుత్వంలో వ్యక్తిగతంగా ఇళ్ళు తీసుకున్న వారు ఉన్నారు. ఈ సొసైటీలో ఎమ్మెల్యేలుగా చేసిన వారు, కార్పొరేషన్ చైర్మన్లుగా , సీపీఆర్వోలు, ప్రభుత్వ పీఆర్ఓలు చేసిన వారు ఉన్నారు. కొందరైతే హైదరాబాద్ పరిధిలో ఏ ఎమ్మెల్యే స్థానిక జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించినా అందులో ఒకటి రెండు ఫ్లాట్లు తెచ్చుకున్న ప్రబుద్దులూ ఉన్నారు. అదే క్రమంలో సిన్సియర్ గా జర్నలిస్టుగా చేస్తూ ఇతరుల వద్ద కప్పు చాయ్ తాగడానికి మొహమాట పడతూ వచ్చీ రానీ జీతంతో కాలం వెళ్లబుచ్చుతూ ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలంతో బిడ్డ పెళ్లి చేద్దామనో, కొడుకుకు ఆసరా చూపిద్దామనో, చరమాంకంలో తమకు నీడగా ఉంటుందనో ఎదురు చూస్తున్న నిజమైన జర్నలిస్టులూ ఉన్నారు. పైగా వీరందరినీ మీరు దగ్గరగా చూశారు. మీకు తెలియంది కాదు.
జై స్వరాజ్ పార్టీ గా మేమనదేమంటే సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు వన్ టైం బెనిఫిట్ కింద 11 వందల మందికి కాదు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారు ఎంత మంది ఉంటే అంత మందికి , అలాగే ఉద్యమంలో సిన్సియర్ గా పోరాడిన అమాయక జర్నలిస్టులకు 300 గజాల చొప్పున ఇంటి స్థలాలను ఇవ్వండి. సమాజం కూడా హర్షిస్తుంది.
గతంలో ఇచ్చిన 70 ఎకరాలు కాకుండా మరి కొన్ని ఎకరాల భూమిని కేటాయించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే దాదాపు ఆరేడు వేల కోట్ల రూపాయల భూమిని ఎక్కువగా అనర్హులకు ఇవ్వబోతున్నారు.
ఇంత ప్రజా ఆస్తి అర్హతలేని జర్నలిస్టులకు ఎలా కేటాయిస్తారు?
ప్రభుత్వం నేతృత్వంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
డిమాండ్లు
వన్ టైం బెనిఫిట్ కింద నిజమైన జర్నలిస్టులకు ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
దరఖాస్తు వెంట జర్నలిస్టుల నుంచి అఫిడవిట్లు తీసుకుని సుప్రీంకోర్టు సూచన మేరకు నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి.
కండ బలం, పైరవీ, లాబీయింగ్ కు ఆస్కారం లేకుండా ముందుగా నిజమైన పేద జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వండి.
మీ ప్రభుత్వం ఇంకా నాలుగు ఏళ్లు పాలించే అవకాశాలు ఉన్నందున తొందరేం లేదు. వన్ టైం బెనిఫిట్ కింద మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంటి స్థలాలు ఇవ్వండి.
ఎప్పుడో ఇల్లు కట్టుకుని ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న వారినే అక్రమంగా చెరువులో కట్టారని హైడ్రా పేరుతో చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు.
సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారని జై స్వరాజ్ పార్టీ ఆశిస్తోంది. లేని పక్షంలో అరవై గజాల ఇంటి స్థలం కోసం జీవిత కాలం ఎదురు చూస్తున్న పేదలకు ఇంటి స్థలం ఇవ్వని మీరు, అర్హతలేని జర్నలిస్టులకు ఎలా ఇన్ని ఎకరాల భూమిని కేటాయించారని ప్రజాక్షేత్రంలో వివరిస్తాం. కలిసొచ్చే వారిని కలుపుకొని ఉద్యమిస్తాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు