దిల్లీ: 14 జనవరి (హి.స.)ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలో కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారించనుంది. ఈ వివాదంపై దాఖలైన 15 కేసులను విచారణకు స్వీకరించకూడదని మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం గత ఆగస్టు 1వ తేదీన తిరస్కరించడంతో కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మథురాలోని కృష్ణాలయాన్ని ఔరంగజేబ్ హయాములో కూలగొట్టి అక్కడ మసీదు నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం రేగడంతో 1991లో పార్లమెంటు ప్రార్థన స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం చేసింది. మన స్వాతంత్య్ర దినమైన 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రార్థన స్థలాలకున్న మత స్వభావాన్ని మార్చకూడదని ఆ చట్టం నిర్దేశిస్తోంది. అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. కృష్ణ జన్మభూమి సమీపంలోని మసీదుపై హిందూ సంస్థలు వేసిన వ్యాజ్యం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మసీదు కమిటీ హైకోర్టులో వాదించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు