అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో ఇవాళ(సోమవారం), రేపు(మంగళవారం) ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
అలాగే, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాలు, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological department) వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV