అమరావతి, 9 అక్టోబర్ (హి.స.)వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు సంబంధించి పోలీసులు అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు. నిర్దేశించిన షరతులను అతిక్రమిస్తే, పర్యటనకు ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేస్తామని, రాజకీయ హోదాతో సంబంధం లేకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తారని ఆయన స్పష్టం చేశారు.
పోలీసు చట్టంలోని సెక్షన్ 30, 30ఏ ప్రకారం నిర్దిష్ట మార్గం, సమయం, పరిమితులకు లోబడే జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చామని డీజీపీ తెలిపారు. పర్యటన మార్గంలో కాన్వాయ్‌కు ముందు లేదా వెనుక ఊరేగింపులు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. అనుమతించిన ప్రాంతాలు మినహా ఇతర చోట్ల రాజకీయ నినాదాలు చేయడం, స్వాగత సభలు ఏర్పాటు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ప్రజలను, కార్యకర్తలను సమీకరించినా లేదా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించినా చట్టపరమైన ఉల్లంఘనగా పరిగణిస్తామని వెల్లడించారు.
కాన్వాయ్‌లో కేవలం 10 వాహనాలకు మాత్రమే చోటు
అంతకుముందు, జగన్ గురువారం నాటి పర్యటనకు సంబంధించి విశాఖ, అనకాపల్లి పోలీసులు 18 నిబంధనలతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. ఆయన కాన్వాయ్‌లో కేవలం 10 వాహనాలకు మాత్రమే చోటు కల్పించారు. పోలీసులు సూచించిన రూట్ మ్యాప్‌లోనే ప్రయాణించాలని, వేరే మార్గాల్లో వెళ్లకూడదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. పర్యటన సందర్భంగా ఏదైనా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగితే నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని, దీనిపై రాతపూర్వక హామీ ఇవ్వాలని ఆదేశించారు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి మాకవరపాలెం వరకు సుమారు 63 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో జగన్ పర్యటనకు వైసీపీ నేతలు అనుమతి కోరారు. అయితే, జాతీయ రహదారిపై భారీగా జన సమీకరణ చేసి ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తమకు సమాచారం ఉందని, దీనివల్ల ప్రజలకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని అనకాపల్లి ఎస్పీ తెలిపారు. ఇటీవల తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటను గుర్తుచేస్తూ, అలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జగన్ హెలికాప్టర్‌లో మాకవరపాలెం చేరుకోవాలని, అందుకు అవసరమైన అనుమతులు ఇస్తామని పోలీసులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV