
న్యూఢిల్లీ, 11 నవంబర్ (హి.స.)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన
నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత నిందితుడు సురేంద్ర కోలిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది. 2005-06లో నోయిడా సమీపంలోని నిఠారీ గ్రామంలో చిన్నారులు, యువతులు అదృశ్యమవడంతో మొదలైన ఈ కేసు... 2006 డిసెంబర్ 29న మోనిందర్ సింగ్ పందేర్ ఇంటి వెనుక మురికి కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడడంతో దేశవ్యాప్త సంచలనం రేపింది.
సీబీఐ దర్యాప్తులో పందెర్ సింగ్ తోపాటు ఆయన ఇంట్లో పని చేస్తున్న సురేందర్ కోలిలు చాకోలెట్స్ ఆశ చూపి చిన్నారులపై అత్యాచారం, హత్య, నరమాంస భక్షణ వంటి ఆరోపణలలో సీబీఐ కోర్ట్ మరణశిక్ష విధించింది. అయితే 2023లో అలహాబాద్ హైకోర్టు కోలిని 12 కేసుల్లో, పందేర్ని రెండు కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించి పందేర్ను విడుదల చేసింది. అనంతరం సీబీఐ, బాధిత కుటుంబాల అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
మరోవైపు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష రద్దు కోరుతూ సురేంద్ర కోలి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. సరైన ఆధారాల లేవని, విచారణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ కోలీ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..