
బెంగళూరు, 6 డిసెంబర్ (హి.స.)
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar)తో పాటు ఆయన సోదరుడు, ఎంపీ డీకే సురేష్ (DK Suresh)లకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో యంగ్ ఇండియన్ (Young Indian) సంస్థకు ఇచ్చిన రూ.2.5 కోట్ల విరాళాల వివరాలు, మూలం, ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు డిసెంబర్ 19లోపు సమర్పించాలని ఆదేశించింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరైనా.. డాక్యుమెంట్లు పంపినా సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ నోటీసులలో ప్రధానంగా యంగ్ ఇండియన్‌కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు ఎందుకు ఇచ్చారు.. ఏ ఉద్దేశ్యంతో ఇచ్చారో చెప్పాలన్నారు. అందుకు డొనేషన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, AICC నేతలతో ఈ లావాదేవీపై ఏదైనా చర్చ జరిగిందా? ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ పోలీసులు డీకే శివకుమార్‌కు ఇచ్చిన నోటీసుల్లో ప్రశ్నల వర్షం కురిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV