
అమరావతి, 6 డిసెంబర్ (హి.స.)
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి (B.R.Ambedkar Death Anniversary) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను స్మరించుకున్నారు. వర్ధంతిని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళిని అర్పించారు. తన ఖాతాలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ప్రచురిస్తూ.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారత దేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించారన్నారు. ఆ మహనీయుడి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు నేడు న్యాయం జరుగుతుందంటే అందుకు కారణం బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. అణగారిన వర్గాల స్వరం బలంగా వినిపిస్తుందంటే అందుకు కారణం కూడా అంబేద్కర్ అని తెలిపారు. అంతేకాకుండా బడుగు, బలహీన వర్గాల వారికి రక్షణ లభించడం వెనక ఆయన చేసిన కృషి ఎనలేనిదనే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు గౌరవం దక్కేలా చేయడంలో రాజ్యాంగం పాత్ర అమోఘమని వర్ణించారు. అంతేకాకుండా పేద వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపును ఇచ్చారు. రాజ్యాంగంలో హక్కులను ఎలా సాధించుకునేందుకు పోరాడతామో.. ఆదేశిక సూత్రాల కేంద్రంగా రాజ్యాంగం సూచించిన బాధ్యతలను కూడా పాటించాలన్నారు. అదే బాబా సాహెబ్ అంబేడ్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV