విజయవాడ, 26 ఏప్రిల్ (హి.స.)
, కర్నూలు: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి అనుబంధ విభాగమైన ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి రూ.310 కోట్లు అప్పు తీసుకున్న వైకాపా మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తుల వేలం దిశగా అడుగులు పడుతున్నాయి. కొంతకాలంపాటు కిస్తీలు సక్రమంగా చెల్లించినప్పటికీ ఐదేళ్ల నుంచి ముఖం చాటేశారు. సంస్థ బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపడంతోపాటు సంప్రదింపులు జరిపినప్పటికీ నిష్ఫలమే అయింది.
బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠలు 2018లో 15ఏళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించేలా రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు రుణాన్ని వినియోగించారు. రుణంపై సుమారు రూ.40 కోట్ల వరకు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా రూ.340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూలు చేయాలని వారు కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపాదన ఉందని హెచ్‌ఎఫ్‌ఎల్ ప్రతినిధులు అంగీకరించలేదు. రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూ.3.40 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం భారంగా మారినందున తొలుత తక్కువ మొత్తం తీసుకుని, చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదననూ హెచ్‌ఎఫ్‌ఎల్ తిరస్కరించింది. రుణాలు చెల్లించడం ఆపేసినందున హెచ్‌ఎఫ్‌ఎల్.. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. రుణ నిబంధనలకు అనుగుణంగా బుట్టా రేణుక దంపతులకు చెందిన బంజారాహిల్స్‌లోని ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మాదాపూర్‌లోని 7,205 చ.గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ వేలానికీ స్పందన రాలేదు. మరోసారి వేలానికీ ప్రయత్నిస్తున్నారు. వేలంలో పాడుకుంటే ఇబ్బందులు వస్తాయోనని చాలామంది వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల