అమరావతి, 26 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేరుస్తూ కీలక అడుగు వేసింది. ప్రతి సంవత్సరం విధించే చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన 'మత్స్యకార చేయూత' పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి గతంలో ఇచ్చే రూ.10,000 భృతిని రెట్టింపు చేస్తూ రూ. 20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకానికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ. 258 కోట్లు జమ కానున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు (61 రోజులు) సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి