అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.)టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను కించపరిచేలా విజయ్ మాట్లాడారని, వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... ఇటీవల తమిళ నటుడు సూర్య నటించిన ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కశ్మీర్‌లోని పహల్గామ్ ఘటనపై స్పందించారు. ఉగ్రవాదులకు సరైన విద్యను అందించి, వారి ఆలోచనా విధానాన్ని మార్చడమే దీనికి పరిష్కారమని అన్నారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు (ట్రైబల్స్) ఘర్షణ పడినట్లుగా కశ్మీర్‌లో దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రైబల్స్ అనే పదం వాడటంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
500 సంవత్సరాల క్రితం కేవలం గిరిజనులు మాత్రమే ఘర్షణ పడినట్టుగా విజయ్ మాట్లాడటం సరికాదని వారు పేర్కొంటున్నారు. ఉగ్రవాదుల చర్యలను ప్రత్యేకంగా గిరిజనుల నాటి ఘర్షణలతో పోల్చడం తమను కించపరచడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిరిజన సంఘాల ప్రతినిధులు తెలిపారు.
ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ తక్షణమే గిరిజన సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన విజయ్, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పని పక్షంలో, తాము క్షమించేది లేదని గిరిజన సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి