మైక్రోసాఫ్ట్ కోడ్‌లో 30 శాతం ఏఐ ద్వారా రాసిందే: సీఈఓ సత్య నాదెళ్ల
వాషింగ్టన్, డి.సి., 1 మే (హి.స.) మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీల‌క విష‌యం వెల్ల‌డించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ కోడ్‌లో 30 శాతం వ‌ర‌కు ఇప్పుడు కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా రాసిందేన‌ని సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ″ఈరోజు మా రెపోలలో ఉన్న కంపెనీ కోడ్‌లో 20 న
మైక్రోసాఫ్ట్ కోడ్‌లో 30 శాతం ఏఐ ద్వారా రాసిందే: సీఈఓ సత్య నాదెళ్ల


వాషింగ్టన్, డి.సి., 1 మే (హి.స.) మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీల‌క విష‌యం వెల్ల‌డించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ కోడ్‌లో 30 శాతం వ‌ర‌కు ఇప్పుడు కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా రాసిందేన‌ని సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.

″ఈరోజు మా రెపోలలో ఉన్న కంపెనీ కోడ్‌లో 20 నుంచి 30 శాతం కృత్రిమ మేధస్సు ద్వారా వ్రాయబడింది” అని నాదెళ్ల పేర్కొన్నారు. సోషల్ మీడియా కంపెనీ లామాకాన్ ఏఐ (AI) డెవలపర్ ఈవెంట్‌లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో లైవ్ లో ఆడియన్స్ తో జరిగిన సంభాషణ సందర్భంగా నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు.

మైక్రోసాఫ్ట్‌లో ఏఐ ద్వారా వ్రాయబడుతున్న కోడ్ మొత్తం క్రమంగా పెరుగుతోందని ఈ సంద‌ర్భంగా నాదెళ్ల తెలిపారు. మెటా కోడ్‌లో ఎంత భాగం AI నుంచి వస్తోందని జుకర్‌బర్గ్‌ను నాదెళ్ల‌ అడిగారు. తనకు సరిగ్గా తెలియదని జుకర్‌బర్గ్ చెప్పారు. కానీ, లామా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి కోడ్‌ను ఏఐ రాస్తుంద‌ని వెల్ల‌డించారు.

తాము ఏఐ ఏజెంట్స్‌ను త‌యారు చేస్తున్నామ‌ని, అవి హైక్వాలిటీ కోడ్ రాయ‌డం, టెస్ట్ ర‌న్‌, బ‌గ్స్ క‌నుగొన‌డం చేస్తాయ‌ని జుకర్‌బర్గ్ అన్నారు. వ‌చ్చే ఏడాదిన్న‌ర‌లోగా మెటాలో కోడింగ్ టాస్కుల‌ను ఏఐ ఏజెంట్స్ పూర్తి చేస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక‌, 2022 చివరలో OpenAI ChatGPTని ప్రారంభించినప్పటి నుంచి కస్టమర్ సర్వీస్ వర్క్, సేల్స్ పిచ్‌లను రూపొందించడం, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి అనేక పనుల కోసం ప్రజలు కృత్రిమ మేధ వైపు మొగ్గు చూపారు. అటు గ‌త అక్టోబర్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ త‌మ కంపెనీ కొత్త కోడ్‌లో 25 శాతం వ‌ర‌కు ఏఐ రాసిందేన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ఇలా రోజురోజుకూ సాఫ్ట్‌వేర్ రంగంలో ఏఐ ఉప‌యోగం పెరుగుతుండ‌డం, తాజాగా స‌త్య నాదెళ్ల‌, మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ వ్యాఖ్య‌ల‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు పొంచి ఉన్న ముప్పుపై మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande