ముంబై, 4 మే (హి.స.) నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శైలేశ్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘హిట్-3’ (హిట్ : ది థర్డ్ కేస్). హిట్ సిరీస్ లో మూడో సినిమా అయిన 'హిట్-3' ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండో రోజే సునాయాసంగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటేసింది. రెండు రోజుల్లోనే ‘హిట్ 3’ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 62 కోట్లకు చేరాయి.
ఇక మూడోరోజు వీకెండ్ కావడంతో హిట్-3 భారీ వసూళ్లు కొనసాగాయి. మొత్తంగా మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 82కోట్ల (గ్రాస్)కు పైగా రాబట్టినట్టు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “ఇట్స్ సర్కార్ షో” అంటూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈరోజు ఆదివారం కావడంతో ఈజీగా రూ. 100కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, ఈ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి