
తాడిపత్రి, 14 జూన్ (హి.స.)తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరగా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కేతిరెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
ఈ అక్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి కేతిరెడ్డి తాడిపత్రి వస్తున్నారని తెలియడంతో 300 మంది టీడీపీ కార్యకర్తలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటివద్దకు చేరుకున్నారు. వెంటనే పోలీసులు తాడిపత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చివరికి కేతిరెడ్డి రావడం లేదని తెలిసిన తరవాత టీడీపీ కార్యకర్తలు అక్కడ నుండి వెళ్లిపోయారు. కాగా ఈ రోజు ఉదయం కేతిరెడ్డి మళ్లీ తాడిపత్రికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తరవాత తాడిపత్రిలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి