న్యూఢిల్లీ, 1 జూలై (హి.స.)
డిజిటల్ ఇండియా కార్యక్రమం నేటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమం 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. భారతదేశాన్ని డిజిటల్ శక్తి గా మార్చడం, డిజిటల్ సాంకేతికత ద్వారా పౌరులకు సేవలను అందుబాటులోకి తీసుకు రావడం, డిజిటల్ అసమానతలను తగ్గించడం లక్ష్యంగా ప్రారంభించగా.. అనుకున్నదాని కంటే ఎన్నో రెట్లు డిజిటల్ ఇండియా విజయవంతం అయింది. ఈ 10 ఏళ్లలో డిజిటల్ ఇండియా భారతదేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పులను తీసుకు వచ్చింది.
సరిగ్గా ఈ రోజుతో డిజిటల్ ఇండియా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినం! పదేళ్ల క్రితం, మన దేశాన్ని డిజిటల్గా సాధికారత పొందిన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన సమాజంగా మార్చడానికి డిజిటల్ ఇండియా ప్రారంభమైంది. ఒక దశాబ్దం తర్వాత, లెక్కలేనన్ని జీవితాలను తాకిన, సాధికారత యొక్క కొత్త శకానికి నాంది పలికిన ప్రయాణానికి మనం సాక్షిగా ఉన్నాము. 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి సంకల్పంతో భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లో అనేక పురోగతిని సాధించింది. ఆరోగ్యం, విద్య వంటి రంగాలు కూడా ఈ చొరవ నుండి ప్రయోజనం పొందాయి అని ప్రధాని మోడీ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..