జోహోర్, 11 జూలై (హి.స.) మలేషియాలోని జోహోర్ పులాయ్ నదిలో ఒక పోలీస్ హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మాక్ డ్రిల్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు మలేషియా పౌర విమానయాన శాఖ తెలిపింది. మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లు మిత్సతోమ్ 2025 పేరుతో బహుపాక్షిక అణు భద్రతా పరిశోధనా కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన పలు బృందాలు పాల్గొన్నాయి.
ఈ క్రమంలో భాగంగా తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందిన ఎయిర్ బస్ (ఏఎస్ 355 ఎన్ హెలికాప్టర్) బయలుదేరింది. అయితే, ఇది గెలాంగ్ పటాలోని మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (ఎంఎంఈఏ) జెట్టీ సమీపంలోకి వచ్చిన వెంటనే ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి పైలట్‌తో సహా ఐదుగురిని రక్షించాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి