అమరావతి, 25 జూలై (హి.స.)
తెనాలి : గుంటూరు సర్వజనాసుపత్రి తరువాత పెద్దదైన తెనాలి జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి మహర్దశ వచ్చింది. ఐతానగర్‌కు చెందిన ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణుడు డాక్టర్ నన్నపనేని ప్రతాప్ తన సొంత నిధులు రూ.కోటితో అత్యవసర విభాగానికి తన తండ్రి నరసింహారావు నామకరణం చేసి, అభివృద్ధి చేయడానికి¨ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఉన్నతాధికారులు డాక్టర్ ప్రతాప్‌తో సంప్రందింపులు జరపగా అంగీకారం తెలిపారు. స్పెషల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు గురువారం అందాయని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త రంగారావు తెలిపారు. దీంతో అత్యవసర విభాగాన్ని 2 పడకల నుంచి 15 పడకలకు పెంచడంతో పాటు మినీ ఐసీయూగా అభివృద్ధి చేయనున్నారు. విభాగం విస్తరణ పనులు, వైద్య పరికరాలు సమకూరుస్తారు. ఇప్పటికే ఏపీఎంఏఎస్‌ఐడీసీ అధికారులు దాత ప్రతాప్‌తో అత్యవసర విభాగ అభివృద్ధికి సంబంధించిన ప్లాన్‌పై చర్చించి తుది ప్రతులను ప్రభుత్వానికి పంపి ఆమోదం తీసుకున్నారు. అత్యవసర విభాగానికి వచ్చిన రోగులకు అవసరమైన చిన్నపాటి శస్త్ర చికిత్సలు చేసే గది కూడా నిర్మించనున్నారు. వెంటిలేటర్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. డాక్టర్ ప్రతాప్ తెనాలి ఆసుపత్రి అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అత్యవసర సమయంలో వైద్యశాల అధికారుల కోరిక మేరకు తన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని పంపి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తోడ్పాటు అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ