హైదరాబాద్, 27 జూలై (హి.స.) ఆసియా కప్ టోర్నీ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో సెప్టెంబరు 14, 21 తేదీల్లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీ కి ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. మ్యాచ్లు మాత్రం యూఏఈలో జరుగుతాయి. కాగా పాకిస్థాన్తో మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్తో మ్యాచ్ అవసరమా?, ఆసియా కప్ 2025 బాయ్కాట్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 'ఆసియా కప్ బాయ్కాట్' అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. దాయాది దేశాల మధ్య ఇదివరకే అంతంత మాత్రం సత్సంబంధాలు ఉండగా.. ఇప్పుడు పూర్తిగా చెడాయి. పాకిస్థాన్తో భారత్ క్రికెట్ ఆడకూడదని మాజీ క్రికెటర్లు, ఫాన్స్ కామెంట్లు చేశారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాకిస్తాన్ ఛాంపియన్స్తో భారత్ ఛాంపియన్స్ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఆడలేమని భారత మాజీలు చెప్పడంతో నిర్వాహకులకు మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. తాజాగా ఆసియా కప్ షెడ్యూల్ విడుదల కాగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు నిర్వహించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్ 2025ని బాయ్కాట్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..